ఇల్లలకాగానే పండగ కాదన్నట్లు ఇతర పార్టీల నుంచి గెలుపు గుర్రాలను తెచ్చుకొంటే సరిపోదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం సాగుతున్న గొడవలు నిరూపిస్తున్నాయి. బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ ఇద్దరికీ మల్కాజిగిరి, మెదక్ టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీలో తోడ్కొని రావడంతో ఈ గొడవలు మొదలయ్యాయి.
ముందుగా వారి రాకతో పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. వారి గొడవ సద్దుమణిగిందనుకొంటే, ఒకే కుటుంబంలో ఇద్దరికీ టికెట్స్ ఇవ్వరాదనే ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను కాదని, మైనంపల్లి హన్మంతరావుకి రెండు టికెట్స్ ఇస్తున్నప్పుడు, మాకెందుకు ఇవ్వరని పార్టీలో సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, సీతక్క తదితరులు అడుగుతున్నారు.
జానారెడ్డి తనకు ఎంపీ టికెట్, తన ఇద్దరు కుమారులు జైవీర్ రెడ్డి (నాగార్జున సాగర్), రఘువీర్ రెడ్డి (మిర్యాలగూడ) టికెట్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు, తన భార్య పద్మావతికి (కోదాడ) టికెట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. కొండా మురళి దంపతులు తామిద్దరికీ, తమ కుమార్తె కొండా సుష్మితలకు టికెట్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఇంకా మల్లు రవి, సీతక్క, పి.జనార్ధన్ రెడ్డి కుటుంబం నుంచి విష్ణు, విజయ తదితరులు టికెట్స్ ఆశిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన మైనంపల్లి హన్మంతరావుకి రెండు టికెట్స్ ఇస్తున్నప్పుడు దశాబ్ధాలుగా పార్టీలో ఉన్న తమకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నారు. నిజమే కదా?