బిఆర్ఎస్‌ అభ్యర్ధులకు బీ-ఫామ్స్ రెడీ

తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో సిఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలో దిగి బిఆర్ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతున్నారు. ముందుగా ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్ధులతో సమావేశమయ్యి దిశా నిర్దేశం చేసిన తర్వాత అందరికీ స్వయంగా బీ-ఫామ్స్ అందిస్తారు. తర్వాత ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా విడుదల చేస్తారు. తర్వాత హుస్నాబాద్ బయలుదేరి సాయంత్రం 4 గంటలకు అక్కడ జరిగే తొలి ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారు.

ఈ నెల 16న వరంగల్‌లో నిర్వహించాల్సిన బహిరంగ సభ అనివార్య కారణాల వలన రద్దు అయ్యింది. కానీ ఆరోజున జనగామ, భువనగిరిలో రెండు సభలలో కేసీఆర్‌ పాల్గొంటారు. మర్నాడు 17న సిద్ధిపేట, సిరిసిల్లా, 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల, ఆదేరోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గాలలో బహిరంగ సభలలో కేసీఆర్‌ పాల్గొనబోతున్నారు. 

సిఎం కేసీఆర్‌ నవంబర్‌ 9న గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్స్ వేయబోతున్నారు. ముందుగా ఉదయం సిద్ధిపేటలోని కోనాయపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత  గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్స్ దాఖలు చేస్తారు. అనంతరం సాయంత్రం కామారెడ్డిలో జరుగబోయే బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు.