
తెలంగాణతో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ నేడే విడుదల కాబోతున్నాయి. కేంద్ర ఎన్నికల కమీషన్ ఈ మేరకు ప్రెస్‌నోట్ విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రంగ్ భవన్లో 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నామని, కనుక అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకావలసిందిగా కేంద్ర ఎన్నికల కమీషన్ ఆహ్వానించింది. మధ్యాహ్నం 11.15 గంటల నుంచి మీడియా ప్రతినిధులను లోనికి అనుమతిస్తారని ఈసీ తెలిపింది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం అధికార బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 119 మంది అభ్యర్ధులను ప్రకటించి, ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకు అభ్యర్ధులను ప్రకటించలేదు కానీ జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. నేడు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతోంది కనుక ఆ రెండు పార్టీలు కూడా వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాలను ప్రకటించక తప్పదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే తెలంగాణతో సహా 5 రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది కనుక కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు వరాలు ప్రకటించేసి, అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రారంభించేసింది. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలకు సంసిద్దంగానే ఉన్నాయి. కనుక ఈసీదే ఆలస్యం అనుకోవచ్చు.