మోడీ, షా, నడ్డా... అందరి గమ్యం తెలంగాణ రాష్ట్రమే

నేడో రేపో తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. కనుక ఇక నుంచి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనబోతున్నారు. 

ఎన్నికలలోగా వీరు ముగ్గురూ కనీసం 30 బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. వీరితో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిద రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ముఖ్య నేతలు కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. 

ఇప్పటికే మోడీ రెండు సభలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే మెదక్ లేదా నల్గొండలో ఎన్నికల ప్రచారసభలలో పాల్గొంటారు. అమిత్ షా ఈ నెల 10న రాజేంద్ర నగర్, అదిలాబాద్ నియోజకవర్గాలలో, ఈ నెల 27న ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఎన్నికల ప్రచారసభలలో పాల్గొంటారు.

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 20,21 తేదీలలో ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఎన్నికల ప్రచారసభలలో పాల్గొంటారు. యూపీ సిఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో ఎన్నికల ప్రచారసభలలో పాల్గొంటారు. 

మహారాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ జిల్లాలలో మహారాష్ట్ర సిఎం ఏక్‌నాధ్ షిండే, మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు అలాగే కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ జిల్లాలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 

ఇంతకాలం ప్రధాని నరేంద్రమోడీ నేరుగా సిఎం కేసీఆర్‌ పేరు ప్రస్తావించి విమర్శలు చేయలేదు. కానీ ఇటీవల నిజామాబాద్‌లో కేసీఆర్‌ ఎన్డీయేలో చేరాలనుకోవడం గురించి బయటపెట్టారు. దానికి బిఆర్ఎస్ జవాబు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడింది. 

కనుక ఇకపై మోడీ, అమిత్ షాలతో సహా తెలంగాణకు వచ్చే బీజేపీ అగ్రనేతలందరూ కేసీఆర్‌, ఆయన కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విమర్శలు, ఆరోపణలు చేయవచ్చు.