
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేసి నిన్న బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వారిద్దరికీ మల్కాజ్గిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు టికెట్స్ ఇస్తామని హామీ ఇవ్వడంతో రెండు నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారు.
తాజాగా నందికంటి శ్రీధర్ కూడా బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వీడాలనుకొంటున్నట్లు తెలియగానే మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీలు సునీత లక్ష్మారెడ్డి, శంబిపూర్ రాజు, నవీన్ కుమార్లతో కలిసి వివేకానంద నగర్లోని ఆయన ఇంటికి వెళ్ళి బిఆర్ఎస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. ఆయన కూడా అందుకు సిద్దంగా ఉండటంతో ఆలస్యం చేయకుండా వెంటనే బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
దీంతో ఈ రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలలోని నేతలు, కార్యకర్తలు అటువారు ఇటు, ఇటువారు అటూ వెళ్ళిన్నట్లయింది. కనుక ఇంతకాలం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను గెలిపించమని కోరినవారే వాటిని ఓడించమని ఎన్నికలలో ప్రచారం చేయబోతున్నారు.