సీతక్కకు ఘోర అవమానం

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం సచివాలయానికి వెళ్ళినప్పుడు అవమానకర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆమె తన ములుగు నియోజకవర్గానికి సంబందించి కొన్ని సమస్యలను సంబందిత శాఖల అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్ళగా లోనికి వెళ్ళేందుకు భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఆమెని లోనికి పంపించేందుకు ఏ మంత్రి, అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోనందున లోనికి అనుమతించలేమని చెప్పడంతో ఆమె వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ భద్రత సిబ్బంది ఆమెను లోనికి అనుమతించకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ, “నేను సచివాలయంలో గొడవ చేయడానికి రాలేదు. నేను ప్రజా ప్రతినిధిని కనుక నా నియోజకవర్గానికి సంబందించి కొన్ని సమస్యలను, అభివృద్ధి పనుల గురించి అధికారులతో మాట్లాడేందుకు వచ్చాను. కానీ సచివాలయంలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనుమతించారని ఇప్పుడే తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల మద్యకు రారు. మేము వెళ్ళి కలుద్దామంటే అనుమతించరు. కనీసం శాసనసభలో మాట్లాడుదామన్నా మైక్ ఇవ్వరు. సచివాలయంలోకి ప్రతిపక్ష నేతలను అనుమతించమని బోర్డు పెట్టేస్తే మంచిది,” అని సీతక్క అన్నారు. 

ప్రజాధనంతో నిర్మించిన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు. కానీ అది బిఆర్ఎస్ పార్టీ సొంత కార్యాలయమన్నట్లు ప్రతిపక్ష నేతలెవరినీ లోనికి ప్రవేశించనీయడం లేదు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని, ఓ దళిత మహిళా ఎమ్మెల్యేని గౌరవించకపోవడాన్ని ఏమనుకోవాలి?