ఖానాపూర్‌లో బిఆర్ఎస్ ఎలా గెలుస్తుందో చూస్తా!

ఖానాపూర్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సిఎం కేసీఆర్‌ ఈసారి టికెట్‌ నిరాకరించి, కేటీఆర్‌ స్నేహితుడు జాన్సన్ నాయక్‌కి టికెట్‌ కేయాయించడంతో ఆమె మండిపడుతున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పార్టీలో మహిళలకుఎప్పుడూ గౌరవం లేదు. ముఖ్యంగా దళిత మహిళలకు అసలే గౌరవం లేదు. ఆ కారణంగానే ఖానాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. నాకు టికెట్‌ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో చెప్పనే లేదు. నేనేమైనా అవినీతికి పాల్పడ్డానా? భూకబ్జాలకు పాల్పడ్డానా? 

నేను నిజాయితీగా పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డాను. కానీ పార్టీలో గుర్తింపు లభించలేదు. చివరికి టికెట్‌ ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి ఇలా అవమానించడం తగునా?మంత్రి కేటీఆర్‌ తన స్నేహితుడికి టికెట్‌ ఇవ్వాలనుకొంటే తన సీటుని ఇచ్చి గెలిపించుకోవచ్చు కదా?ఖానాపూర్‌ నియోజకవర్గమే ఎందుకు?

నాకు టికెట్‌ ఇవ్వకపోయినా నేను స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే సత్తా నాకుంది. ఖానాపూర్ నుంచే నేను పోటీ చేస్తా. కేటీఆర్‌ స్నేహితుడు జాన్సన్ నాయక్ ఏవిదంగా గెలుస్తారో నేను చూస్తాను. ఆయనను మరెవరో కాదు నేనే ఓడిస్తాను,” అని రేఖా నాయక్ సవాలు విసిరారు.