తెలంగాణ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం హడావుడిగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకి ఆమోదం తెలిపి వెంటనే దాని కోసం గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనేది తెలంగాణ డిమాండ్. అయితే ప్రభుత్వం జారీ చేసిన గజెట్ నోటిఫికేషన్లో ఎక్కడా తెలంగాణ ప్రస్తావనే లేదు. దానిలో బోర్డు ఏర్పాటుకి గల కారణాలు పేర్కొని, బోర్డుకి ఓ ఛైర్మన్, కేంద్ర వాణిజ్య, వ్యవసాయ, సంక్షేమ, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు చెందిన నలుగురు సభ్యులు ఉంటారని పేర్కొంది.
వీరుగాక పసుపు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ప్రతినిధులు, పసుపు, పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నవారి తరపున ఇద్దరు ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుందని నోటిఫికేషన్లో పేర్కొంది.
జాతీయ స్పైసస్ (మసాలా దినుసులు) బోర్డు డైరెక్టర్, కేరళలోని కోజీకోడ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పైసస్ రీసర్చ్ డైరెక్టర్, గౌహతీ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పైసస్ రీసర్చ్ డైరెక్టర్, నేషనల్ మెడిసినల్ ప్లాంట్ సీఈవో, కార్యదర్శి ఈ జాతీయ పసుపు బోర్డులో సభ్యులుగా ఉంటారని నోటిఫికేషన్లో పేర్కొంది.
దీనిలో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన లేదు. ఈ బోర్డుని ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తోందో కూడా పేర్కొనలేదు. పసుపు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల నుంచి ముగ్గురు సభ్యులని పేర్కొంది. అంటే తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఉందని భావించవచ్చు.