
‘ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందట గదా?’ ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది నోట వినిపిస్తున్న మాట. వారు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లున్నా ఈ ‘మౌత్ టాక్’ మార్పుకి సంకేతంగా భావించవచ్చు.
ఎన్నికల దగ్గర పడుతున్నకొద్దీ వివిద మీడియా, సర్వే సంస్థలు కూడా రాష్ట్రంలో సర్వేలు జరుపుతూ తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ ‘లోక్ పోల్’ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 30వరకు సర్వే జరిపి తమ అంచనాల ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది.
దాని అంచనాల ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీకి 61 నుంచి 67 సీట్లు, బిఆర్ఎస్ పార్టీకి 45-51 సీట్లు, మజ్లీస్ పార్టీకి 6-8 సీట్లు, బీజేపీకి 2-3 సీట్లు, ఇతరులకు ఒక్క సీటు లభించవచ్చని తెలిపింది.
అయితే టైమ్స్ నౌ వంటి ప్రముఖ మీడియా సంస్థలు ఈసారి కూడా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీయే గెలిచి అధికారంలోకి వస్తుందని చెపుతున్నాయి. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇంకా చాలా సర్వేలు, అంచనాలు వెలువడుతూనే ఉంటాయి.
కొన్ని పార్టీలు ప్రజలకు తామే గెలవబోతున్నామని నమ్మకం కలిగించి ఓట్లు రాబట్టుకొనేందుకు ప్రీ-పెయిడ్ సర్వేలు కూడా ఉండవచ్చు. కనుక సర్వేల అంచనాలన్నీ నిజమూ కాదు అబద్దమూ కావు. ప్రజలే వాటిలో నిజానిజాలను గ్రహించి తేల్చుకోవాల్సి ఉంటుంది.