బిఆర్ఎస్‌కు గుడ్ బై: ఎమ్మెల్యే రేఖా నాయక్

ఖానాపూర్ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలలో తనకు మళ్ళీ టికెట్ ఇవ్వకుండా మంత్రి కేటీఆర్‌ స్నేహితుడు భూక్యా జాన్సన్ రాథోడ్‌కి టికెట్‌ ఇప్పించుకోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. 

ఆమె పార్టీని వీడుతానని వెంటనే ప్రకటించారు. ఆ తర్వాత ఆమె భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ రేఖా నాయక్‌కు కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ టికెట్‌కు హామీ ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరడం లేదు. రాబోయే ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని నిర్ణయించుకొన్నట్లు రేఖా నాయక్ తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. టికెట్ లభించదని గ్రహించినవారు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. మెదక్ నియోజకవర్గం టికెట్‌ను బిఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హనుమంత రావు కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు ఇవ్వాలని నిర్ణయించడంతో మెదక్ జిల్లా కాంగ్రెస్‌  అధ్యక్షుడు కాంతారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 

ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి దానిలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నేతలు మారుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడి నామినేషన్స్ ప్రక్రియ ముగిసేవరకు నాయకుల కప్పగంతులు కొనసాగుతూనే ఉంటాయి.