
తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉంది కనుక బిఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుగా ముందుకు సాగేందుకు సన్నాహాలు చేసుకొంటోంది. ఈ నెల 16న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానిలో సిఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రకటిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఆ మ్యానిఫెస్టో రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్తలను తీసుకురాబోతోందని కనుక ప్రజలు దానికోసం ఎదురుచూడాలన్నారు. కానీ అదే మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిపోతుందని అందుకు సిద్దంగా ఉండాలని అన్నారు.
ఇప్పటికే కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు వరాలు కురిపించేశారు. ఇంకా కురిపిస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నికల మ్యానిఫెస్టోలో మరింత పెద్దదేదో ప్రకటించబోతున్నారని మంత్రి హరీష్ రావు అని చెప్పడంతో సర్వత్రా దానిపై ఆసక్తి ఏర్పడింది.
కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకు తమ అభ్యర్ధులనే ప్రకటించలేకపోయాయి. అభ్యర్ధులను ప్రకటించగానే పార్టీలో టికెట్ దక్కనివారు అలకలు, రాజీనామాల ఎపిసోడ్స్ ఉంటాయి. వాటినీ పరిష్కరించుకోవలసి ఉంటుంది.
కానీ బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడమే కాకుండా ఆ అలక పాన్పు ఎపిసోడ్స్ కూడా అప్పుడే ముగించేసుకొని ఎన్నికల ప్రచారానికి కూడా సిద్దమైపోతోంది.