బిఆర్ఎస్ ఎన్నడూ పొత్తులు పెట్టుకోలేదు: కేటీఆర్‌

సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవాలని తనను అడిగారని ప్రధాని నరేంద్రమోడీ చెప్పడంపై మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. 

“తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు చాలా పార్టీలు మాతో కలవాలనుకొన్నాయి కానీ మేము ఎవరితోనూ కలవలేదు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ని ఓడించేందుకు ప్రతిపక్షాలు తమ సిద్దాంతాలను, విభేధాలను పక్కన పెట్టి చేతులు కలిపాయి. 2018లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ కుదిరితే మాతో పొత్తులకు సిద్దమంటూ మీడియాకు చెప్పారు. ఆయన తమ అధిష్టానం అనుమతి లేకుండానే ఆ ప్రతిపాదన చేయగలరా?ఆయన ఆ ప్రతిపాదన చేసిన మరుక్షణమే మేము దానిని తిరస్కరించాము. మా గురించి కట్టుకధలు చెప్పేందుకు రాష్ట్రానికి వస్తున్న రాజకీయ పర్యాటకులు ఈ విషయం తెలుసుకొని మాట్లాడితే మంచిది. 

అయినా జీహెచ్‌ఎంసీలో మాకు సొంత బలంతోనే అధికార పీఠం దక్కించుకోగలిగినప్పుడు బీజేపీతో చేతులు కలపాల్సిన అవసరం మాకేమిటి? మేము ఫైటర్స్ మాత్రమే ఛీటర్స్ కాదు,” అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.