1.jpg)
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు షెడ్యూల్ జారీ అయ్యింది. వచ్చే నెల 28న ఎన్నికలు నిర్వహించబోతునట్లు ఎన్నికల అధికారి డి.శ్రీనివాసులు తెలిపారు.
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికీ కనీసం రూ.2.5 లక్షల వేతన బకాయిలు చెల్లించింది. దసరా, దీపావళి బోనస్, సాలరీ అడ్వాన్స్ వీటికి అదనం. ఇవన్నీ కలిపి ఒక్కొక్కరికీ కనీసం రూ.4-5 లక్షల వరకు చేతికి అందుతుంది.
ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులను ఈరూపంగా ప్రలోభపెడుతోందని సింగరేణిలో మిగిలిన యూనియన్లు ఆరోపిస్తున్నాయి. కనుక శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు సింగరేణి గుర్తింపు ఎన్నికలను వాయిదా వేయాలని 13 కార్మిక సంఘాలు ఎన్నికల అధికారి డి.శ్రీనివాసులుని లిఖితపూర్వకంగా అభ్యర్ధించాయి.
సింగరేణి ఎన్నికలలో టిబిజికెఎస్ విజయం సాధిస్తే ఆ ప్రభావం వెంటనే జరుగబోయే శాసనసభ ఎన్నికలపై కూడా తప్పక ఉంటుంది. తద్వారా ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందుతుంది. అందుకే ప్రతిపక్షాలు, వాటి అనుబంద కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు జరపడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
అయితే బిఆర్ఎస్ పార్టీకి అనుబంద తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని (టిబిజికెఎస్), ఆ తర్వాత శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొనేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని లక్షలు పంచిపెట్టినప్పుడు ఎన్నికలను వాయిదా వేయనిస్తుందనుకోవడం అవివేకమే కదా?