రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకొంటున్నారట?

ప్రతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో తప్పక వినిపించే ఆరోపణ పిసిసి అధ్యక్షుడు టికెట్స్ అమ్ముకొంటున్నారని! ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ టికెట్స్ అమ్ముకొని భారీగా సంపాదిస్తున్నారని బిఆర్ఎస్‌ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త మనోహర్ రెడ్డి అన్నారు. 

మహేశ్వరం టికెట్ కోసం బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి వద్ద నుంచి రూ.10 కోట్లు నగదు, 5 ఎకరాల వ్యవసాయ భూమి రేవంత్‌ రెడ్డి తీసుకొన్నాడని ఆయన ఆరోపించారు. దీనిని నిరూపించే సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని తగిన సమయంలో వాటిని బయటపెడతానని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీలో అందరికంటే సీనియర్ నాయకుడైన వి.హనుమంతరావుని తాను ఢిల్లీలో కలిసినప్పుడు ఆయనే ఈ విషయం తనకు చెప్పారన్నారు. కొంతమంది అభ్యర్ధుల వద్ద నుంచి టికెట్ కోసం రేవంత్‌ రెడ్డి పది కోట్లు డిమాండ్ చేశారని కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నుంచి బిఆర్ఎస్‌  అభ్యర్ధిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా టికెట్స్ కేటాయిస్తున్న విధానంపై నిశిత విమర్శలు చేశారు. “రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువుంది. కనుక కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే కనీసం 50 శాతం (60) టికెట్లు బీసీలకే ఇవ్వాలి. కానీ 34 టికెట్లే ఇస్తామని చెపుతున్నారు. ఇలా అయితే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమే,” అని అన్నారు.