బిఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి సీటుని మళ్ళీ మైనంపల్లి హన్మంతరావుకే కేటాయించినప్పటికీ, తన కుమారుడు రోహిత్‌కు మెదక్ సీటు ఇవ్వనందుకు అలిగి పార్టీకి రాజీనామా చేశారు.
ఆయన స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు మధ్యాహ్నం తన అనుచరులతో ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి మల్లారెడ్డి కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోటోలతో భారీగా పోస్టర్స్ ఏర్పాటు చేశారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి తన తండ్రి మర్రి లక్ష్మణ్ రెడ్డి పేరిట దుండిగల్ వద్ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సహా మరికొన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేసి వాటికి ఛైర్మన్, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. చాలా కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరీ జిల్లాలో ఆరు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు.
ఆయన సమీప బంధువు మల్లారెడ్డి ప్రోత్సాహంతో 2019లో బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రత్యక్షరాజకీయాలలోకి వచ్చారు. మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో అనూహ్యంగా మల్కాజిగిరి టికెట్ రాజశేఖర్ రెడ్డికి లభించింది. అయితే ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న మైనంపల్లి హన్మంతరావునే ఎదుర్కోవలసి ఉంటుంది.