
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తనను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఒంటరిగా విచారణ చేయడాన్ని ఆమె సుప్రీంకోర్టు సవాలు చేయగా నేడు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేస్తూ అప్పటివరకూ ఆమెకు ఈడీ ఎటువంటి నోటీసులు పంపవద్దని, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నవంబర్ 20 వరకు అంటే దాదాపు రెండు నెలలపాటు ఆమెకు ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది. అప్పటికి తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది కనుక మళ్ళీ మరోసారి ఈ కేసు వాయిదా పడే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఈ కేసు విచారణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వాయిదా పడుతున్నట్లయితే, అప్పటి పార్టీల బలాబలాలు, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం, దాని ఏర్పాటు కోసం పార్టీల మద్దతులు తదితర అంశాలన్నీ ఈ కేసు ప్రభావం చూపడం తధ్యం. అప్పుడు ఈ కేసు శాస్వితంగా అటకెక్కవచ్చు లేదా కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.