21.jpg)
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు చాలా మందే ఉన్నారు. వారందరూ ఎన్నికలలో పోటీ చేసేందుకు కేసీఆరే డబ్బు ఇస్తాడు. తర్వాత కేసీఆర్ చెయ్యి ఊపగానే కాంగ్రెస్‌లో గెలిచిన వారందరూ పరుగున బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఓ ఏటిఏం వంటిది. ఎప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలంటే అంతమందిని తీసుకోగలరు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్ధులు గెలవాలని కోరుకొంటారు.
కాంగ్రెస్‌లోనే కాదు... స్వతంత్ర అభ్యర్ధులుగా గెలిచే అవకాశాలున్నవారికి కూడా కేసీఆరే డబ్బు ఏర్పాటు చేస్తారు. గెలిచిన తర్వాత బిఆర్ఎస్ పార్టీలోకి రప్పించుకొంటారు. రాష్ట్రంలో ఎవరైనైనా గెలిపించేది, ఓడించేది కూడా కేసీఆరే.
చివరికి తను స్వయంగా ప్రకటించిన 115 మంది బిఆర్ఎస్ అభ్యర్ధులలో సగం మందికి కూడా కేసీఆర్ టికెట్ ఇవ్వరు. పార్టీలో నేతలు చేజారిపోకుండా ఉండేందుకే కేసీఆర్ అందరికీ టికెట్స్ ఖరారు చేస్తూ జాబితా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కులాల కొట్లాట కూడా కేసీఆరే పెట్టించారు. బిఆర్ఎస్ పార్టీలో పైసల కొట్లాట, కాంగ్రెస్‌లో కులాల కొట్లాటలు నడుస్తున్నాయి,” అని బండి సంజయ్ అన్నారు.
కాంగ్రెస్ తరపు పోటీ చేసినవారు గెలిచిన తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతారని కేసీఆర్ నిరూపించి చూపారు. బండి సంజయ్ కూడా అదే చెపుతున్నారు. కనుక ఇది కాంగ్రెస్ విశ్వసనీయతను ఎప్పుడూ దెబ్బ తీస్తూనే ఉంటుంది.