మొన్న ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్, కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్‌పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముగ్గురూ కలిసి దిగిన ఫోటో మీడియాలో వచ్చింది. కేసీఆర్ వారిద్దరికీ రాజీ కుదిర్చారని, కడియం గెలుపు కోసం రాజయ్య పనిచేస్తారని ఆ వార్తల సారాంశం.
ఈ వార్తలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను ప్రగతి భవన్‌కు వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది ఎమ్మెల్సీలున్నారు. వారిలో కడియం కూడా ఒకరు. మర్యాద కోసం మేము కేటీఆర్‌తో కలిసి ఫోటో దిగాము. ఆ ఫోటోను పట్టుకొని మీడియా నేను రాజీపడ్డానంటూ ఏదేదో వ్రాసేసింది. నేతలు రాజీపడినంత మాత్రన్న కార్యకర్తలు రాజీ పడలేరు కదా? కార్యకర్తలు సమ్మతి లేకుండా నేను రాజీపడ్డానని వ్రాయడం సరికాదు. సిఎం కేసీఆర్ నాకు ఎంపీ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ చేశారు. ఆలోగా ఏదైనా కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామని కూడా చెప్పారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు,” అని అన్నారు.
అంటే స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి గెలుపు కోసం రాజయ్య సహాయసహకారాలు అందించనని చెపుతున్నారా?ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు తప్ప మరేదీ తనకు అంగీకారం కాదని చెపుతున్నారనుకోవచ్చు. కనుక ఆ పదవులకు కేసీఆర్ గ్యారెంటీ ఇవ్వకపోతే ఎన్నికలలో కడియంను ఓడగొడతానని కేసీఆర్, కేటీఆర్‌లను హెచ్చరిస్తున్నారా? రాజయ్యే చెప్పాలి.