మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

దశాబ్ధాలుగా అమలుకు నోచుకోని మహిళా రిజర్వేషన్ బిల్లుని నిన్న లోక్‌సభ ఆమోదించింది. దీంతో దేశ రాజకీయాలలో ఓ నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. నూతన పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన ఈ తొలిబిల్లుకి దేశంలో దాదాపు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలపడం మరో విశేషం.

నిన్న సభలో దీనిపై ఓటింగ్ జరిగినప్పుడు 454 మంది సభ్యులలో అసదుద్దీన్ ఓవైసీ, మహారాష్ట్రకు చెందిన సయ్యద్ ఇంతియాజ్ జలీల్ ఇద్దరు ఎంపీలు మాత్రమే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయగా మిగిలినవారందరూ బిల్లుకు మద్దతు పలకడంతో లోక్‌సభ ఆమోదం పొందింది. 

నేడు రాజ్యసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. అక్కడా దీనికి ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. కనుక త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చబోతోంది. అయితే దీనిని 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో జనగణన జరిపి, దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిపిన తర్వాతే అమలుచేస్తామని బిల్లులోనే స్పష్టంగా పేర్కొన్నారు. కనుక ఆలోగా జరిగే శాసనసభ ఎన్నికలలో కూడా మహిళా రిజర్వేషన్లు అమలుకావు.