9.jpg)
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పధకాలపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పధకాలు కాదు... మళ్ళీ హైదరాబాద్‌లో కర్ఫ్యూలు, పరిశ్రమలకు పవర్ హాలీడేస్, విద్యుత్ కోతలు మొదలవడం ఖాయం. కాంగ్రెస్ హామీలన్నీ పోస్ట్ డేటడ్ చెక్కులు వంటివే. కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక అక్కడ రూ.600 మాత్రమే పింఛను ఇస్తూ ఇక్కడ రూ.4,000 ఇస్తామంటున్నారు. అక్కడ అమలుచేయని హామీలను తెలంగాణలో అమలుచేస్తామంటే నమ్మగలమా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ 6 నెలలకు ముఖ్యమంత్రి మారడం కూడా ఖాయమే. ఇప్పుడు బెంగళూరు నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌ను శాశిస్తున్నారు కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మనకు బెంగళూరు రెండో రాజధాని అవుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి బాస్ కాబోరు. వారి బాసులు బెంగళూరు, ఢిల్లీలో ఉంటారు. కనుక పార్టీలో ఏదైనా సమస్య ఏర్పడితే ముందు అక్కడికి పరుగులు తీసి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి వస్తుండాలి.
ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా... లేక రాష్ట్రాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్: 1 స్థానంలో నిలిపిన కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. త్వరలోనే బిఆర్ఎస్ ఓ అద్భుతమైన మ్యానిఫెస్టోను ప్రకటించబోతోంది,” అని అన్నారు.
కాంగ్రెస్ పాలన ఏవిదంగా ఉంటుందో గతంలో ప్రజలు చూశారు. అధికారంలో లేనప్పుడే పదవుల కోసం కీచులాడుకొంటున్న కాంగ్రెస్ నేతలు రేపు అధికారంలోకి వస్తే కీచులాడుకోకుండా ఉంటారా?అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించడానికే కాంగ్రెస్ భయపడుతోందంటే ఆ పార్టీలో పరిస్థితి అర్దం చేసుకోవచ్చునని బిఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదనలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పగలరా?