
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఉదయం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతోపాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే యన్నమ్ శ్రీనివాస్ రెడ్డి, జీట్టా బాలకృష్ణ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.
గత ఎన్నికలలో తుమ్మల ఓడిపోయినప్పటి నుంచి సిఎం కేసీఆర్ ఆయనను పట్టించుకోకపోవడంతో ఇంతకాలం ఆయన ఓపికగా ఎదురుచూశారు. కానీ కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరి ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.
అయితే ఆయన కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వైఎస్ షర్మిల కూడా పాలేరు నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు.
వారిలో షర్మిలను పక్కన పెట్టి పొంగులేటిని ఖమ్మం నుంచి, తుమ్మలను పాలేరు నుంచి బరిలో దింపబోతున్నట్లు సమాచారం. పాలేరు టికెట్ ఇస్తామని నిన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు హామీ ఇచ్చిన మీదటనే తుమ్మల నేడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.