తెలంగాణ దశాబ్ధాల కల నేడు నెరవేరబోతోంది. నేడే సిఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో రేగిమానుగడ్డ వద్ద నిర్మించిన పంప్ హౌసులో మీట నొక్కి మోటర్ ఆన్ చేసి నీటిని విడుదల చేస్తారు.
రూ.55,086 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులు 2016లో ప్రారంభించి నేటికీ మొదటి దశ పనులు పూర్తిచేశారు. దీనిలో కాళేశ్వరం ప్రాజెక్టులో అమర్చిన మోటర్ల కంటే భారీ పంప్ మోటర్లను అమర్చారు. ఒక్కోటి 145 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన 34 భారీ పంప్ మోటర్లు 104 మీటర్ల ఎత్తుకు 3,200 క్యూసెక్కుల నీళ్ళు తోడిపోయగలవు.
నాగర్కర్నూల్ జిల్లాలోని కోతిగుండు వద్ద కృష్ణానది (బ్యాక్ వాటర్స్) నుంచి నీళ్ళను అప్రోచ్ కాలువ ద్వారా రేగిమానుగడ్డ వద్ద నిర్మించిన పంప్ హౌ స్కు తరలించి అక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తూ అంజనగిరి, అక్కడి నుంచి వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ, ఉదండాపూర్ చివరిగా కేపి లక్ష్మీదేవిపల్లి వద్ద నిర్మించిన జలాశయాలకు నీటిని ఎత్తిపోస్తారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్ ఆరు జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ఆరు జిల్లాలలో 1,226 గ్రామాలకు స్వచ్చమైన త్రాగునీరు లభిస్తుంది. దీంతో ఆయా జిల్లాల ప్రజల నీటి కష్టాలు శాస్వితంగా తొలగిపోనున్నాయి. దశాబ్ధాలుగా తాగు, సాగు నీటికి నోచుకోక అల్లాడుతున్న ఈ జిల్లాల ప్రజలకు, రైతులకు ఈ ప్రాజెక్టు కేసీఆర్ ఇచ్చిన వరంగా చెప్పకతప్పదు.