23.jpg)
తెలంగాణ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలుచేస్తోంది. తాజాగా మరో చక్కటి పధకాన్ని అక్టోబర్ 24 నుంచి ప్రారంభించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి వరకు విద్యార్ధులు అందరికీ 'ముఖ్యమంత్రి అల్పాహారం పధకం' కింద అల్పాహారం (టిఫిన్) అందించాలని నిర్ణయించింది.
దీని కోసం సంబందిత శాఖల ఐఏఎస్ అధికారులు తమిళనాడులో పర్యటించి అక్కడ ఈ పధకాన్ని ఏవిదంగా అమలుచేస్తోందో అధ్యయనం చేసి వచ్చారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయబోతున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయబోతోంది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే విద్యార్ధులందరూ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవారే కనుక వారు ఉదయం ఏమీ తినకుండా ఆకలి కడుపులతో పాఠశాలలకు వస్తుంటారు. ప్రభుత్వంపెట్టే మధ్యాహ్న భోజనంతోనే వారు కడుపునింపుకొంటుంటారు.
ఆకలి కడుపుతో చదువుపై శ్రద్ద పెట్టడం కష్టం. అదీగాక పౌష్టికాహారలోపంతో చాలా మంది విద్యార్ధులు బాధపడుతుంటారు. కనుక వారందరికీ ఈ పధకం ద్వారా ఆకలి తీర్చడంతో పాటు పౌష్టికాహారం కూడా లభిస్తుంది. కనుక తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పద్ధకాలలో ఇదీ ఒకటిగా నిలువబోతోందని చెప్పవచ్చు.