
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ విప్రో జంక్షన్ వద్ద ఐటి కంపెనీ ఉద్యోగులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. నేడు టిడిపి మహిళా కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఈ ప్రాంతం నిత్యం వచ్చిపోతే వేలాదివాహనాలతో చాలా రద్దీగా ఉంటుంది. కనుక ఇక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతి లేదని మాధాపూర్ డీసీపీ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఒకవేళ ఎవరైనా సైబరాబాద్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించిన్నట్లయితే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
ఆనాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఐటి రంగానికి పునాది వేసినందునే నేడు తామందరం ఐటి ఉద్యోగాలు చేసుకొంటూ సుఖంగా జీవిస్తున్నామని, అటువంటి దార్శనికుడైన చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందని ఆందోళన చేస్తున్న ఐటి ఉద్యోగులు వాదిస్తున్నారు. కనుక తాము చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతూ, ఆయన విడుదల చేయాలని కోరుతూ నిరసన తెలుపున్నామని చెపుతున్నారు.
వారు చెపుతున్నది వాస్తవమే అయినప్పటికీ, గత 9 ఏళ్ళలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఐటి రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేసింది. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఐటి ఉద్యోగులు హైదరాబాద్లో ఆందోళనలు చేస్తే, దీనికి రాజకీయరంగు అంటుకొంటే, బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. బహుశః అందుకే ఇది తమకు రాజకీయ సమస్యగా మారక మునుపే పోలీసుల ద్వారా కట్టడిచేసిన్నట్లు భావించవచ్చు.