
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు నేడు ఢిల్లీలో హాజరుకావాలంటూ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీస్ ఇవ్వడంతో ఆమె చెప్పిన్నట్లుగానే మళ్ళీ ఈ డైలీ టీవీ సీరియల్లో కొత్త ఎపిసోడ్ మొదలైంది. ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు ఈడీ మళ్ళీ తనకు నోటీస్ ఇవ్వడాన్ని కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
దీనిపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపినప్పుడు, కల్వకుంట్ల కవిత తరపు వాదించిన న్యాయవాది మహిళల విచారణ విషయంలో సుప్రీంకోర్టు గతంలో నళినీ చిదంబరంకు మినహాయింపు ఇచ్చిందని, అలాగే మరో కేసులో కూడా వేరొకరికి మినహాయింపు ఇచ్చిన విషయం గుర్తు చేసి, కల్వకుంట్ల కవితకు కూడా ఈడీ కార్యాలయంలో విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కల్వకుంట్ల కవితని ఈడీ విచారించే విషయంలో సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువరించేవరకు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ మద్యలో ఈడీ నోటీసులు ఇవ్వకుండా స్టే విధించాలని కోరారు. ఒకవేళ ఈ కేసులో కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేస్తే సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అవకాశం కూడా కల్పించాలని కోరారు.
ఈడీ తరపు న్యాయవాది వాదిస్తూ కల్వకుంట్ల కవితకు మరో పదిరోజులు గడువు ఇస్తామని కానీ అప్పుడు ఆమె తప్పక హాజరు కావలసి ఉంటుందని ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అంతవరకు కల్వకుంట్ల కవితను విచారణకు హాజరుకావాలని ఈడీ ఒత్తిడి చేయవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.