ఏ ఆడబిడ్డకు ఈ కష్టం రావద్దు: విజయశాంతి

సిఎం కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం విచారణకు హాజరుకావలంటూ ఈడీ తాజాగా నోటీస్ జారీ చేయడంపై బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి స్పందించారు. అయితే ఆమె స్పందన కాస్త అనూహ్యంగా ఉండటం విశేషం. ఏ ఆడబిడ్డకు ఇటువంటి కష్టం రాకూడదంటూ ఆమెపై సానుభూతి చూపుతూనే ఆమె ఈ కేసులో నుంచి నిర్ధోషిగా బయటపడతారని ఆశిస్తున్నామని అన్నారు. 

ఆమెను అరెస్ట్ చేయకపోతే బిఆర్ఎస్‌, బీజేపీల మద్య రహస్య అవగాహన ఉందని మజ్లీస్‌ ధోరణి కలిగిన నేతలు కొందరు వాదిస్తున్నారని, కానీ రెండు పార్టీల మద్య అవగాహన ఉందని ప్రజలు భావించి తమకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారేమోనని బిఆర్ఎస్‌కి భయం ఉందేమో కానీ బీజేపీకి లేదని విజయశాంతి ట్వీట్ చేశారు. 

అయితే తెలంగాణ బీజేపీలో కొండావిశ్వేశ్వర్ రెడ్డి వంటి కొందరు నేతలే అధిష్టానం ముందు ఇటువంటి వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. కనుక విజయశాంతి వారికే ఈ చురక వేశారా?అనే సందేహం కలుగుతుంది.