ఏడాది బట్టి లిక్కర్ స్కామ్‌ కేసు.. డైలీ సీరియలా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణకు శుక్రవారం హాజరుకావలంటూ ఈడీ పంపిన నోటీస్ అందిందని బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అయితే తాను విచారణకు హాజరుకానని కూడా చెప్పేశారు. ఏడాది బట్టి ఈడీ విచారణ జరుపుతున్నప్పటికీ ముగించకుండా డెయిలీ టీవీ సీరియల్లాగా సాగదీస్తోందని, ఎన్నికలకు ముందు కొత్త ఎపిసోడ్ ప్రారంభించాలనుకొంటోందని కవిత ఎద్దేవా చేశారు. కనుక ఈ కేసు సంగతి తన లీగల్ టీమ్ చూసుకొంటుందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఈడీ నోటీస్ పంపించడం రాజకీయ దురుదేశ్యంతో కూడినదేనని అన్నారు. 

ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డి, అరుణ్ కుమార్‌ పిళ్లై తదితరులు అందరూ అప్రూవర్లుగా మారి బెయిల్ పొంది బయటకు వచ్చేశారు. కనుక వారిని అడ్డుపెట్టుకొని తనను అరెస్ట్ చేసి, తన తండ్రి కేసీఆర్‌ని, తమ బిఆర్ఎస్‌ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోందని కవిత భావిస్తున్నారు. అయితే ఈ కేసు నుంచి బయటపడే వరకు న్యాయపోరాటం చేస్తానని కల్వకుంట్ల కవిత చెప్పారు.