కాంగ్రెస్‌ నిండిపోయింది... బయటవాళ్ళు మాకు అక్కరలేదు

ఈసారి తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నమ్ముతున్న ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈసారి ఎన్నికలలో పోటీ చేసేందుకు దరఖాస్తు ఫీజుగా రూ.50 వేలు పెట్టినా అదీ చెల్లించి 119 స్థానాలకు మొత్తం 1,016 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంకా చాలా మంది టికెట్ల కోసం పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ నేతల ద్వారా పైరవీలు చేసుకొంటూనే ఉన్నారు. కొందరు నేరుగా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీతోనే మాట్లాడి టికెట్ సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్ల కోసం ఈ ఒత్తిడి ఎంతగా పెరిగిపోయిందంటే, ఇక మా పార్టీలో ఎవరినీ చేర్చుకోమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పాల్సి వచ్చేంత. 

గురువారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలో ఖాళీ లేదు. పూర్తిగా నిండిపోయింది. అందరికీ టికెట్లు ఇవ్వలేక మేమే కొందరికి ఎమ్మెల్సీ, కొందరికి జెడ్పీ ఛైర్మన్, కొందరికి రాజ్యసభ సీట్లను అడ్జస్ట్ చేసి ఇస్తామని చెపుతున్నాము. కనుక కొత్తగా వచ్చేవారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోము. టికెట్ల కోసమే అయితే ఆ ‘కారు పార్టీ’లో చాలా ఖాళీలున్నాయి. వెళ్ళి దానిలో చేరితే మంచిది. టికెట్ల కోసం మా మీద ఒత్తిడి చేయడం సరికాదు,” అని అన్నారు.