టీఎస్‌ఆర్టీసీ విలీనం బిల్లుకి గవర్నర్‌ ఆమోదముద్ర

టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పంపిన బిల్లుకి నేడు గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారిన్నట్లయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం దీని ముసాయిదా బిల్లుని ఆమె వద్దకు పంపినప్పుడే ఆమె దానిపై కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. వాటిపై ప్రభుత్వం తరపున అధికారులు వచ్చి ఆమెకు వివరణ ఇవ్వడంతో ఆమె దానిని ఆమోదించారు. 

అదే బిల్లుని శాసనసభ ఆమోదించిన పంపినప్పుడు మళ్ళీ ఆమె కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కార్మికుల ఉద్యోగభద్రత, ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతభత్యాలు, పదవీవిరమణ తర్వాత పెన్షన్, వైద్యసేవలు తదితర 10 అంశాలపై వివరణ కోరగా మళ్ళీ అధికారులు వాటిపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడంతో ఆమె సంతృప్తి చెంది ఈ బిల్లును ఆమోదించారు. 

కనుక ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకొనే విధివిధానాలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు విలీనం ప్రక్రియ జరుగుతుంది. బహుశః దీనికి మరో రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు.