పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఆ రెండూ ఉండవా?

ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ సమావేశాలలో ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు, లోక్‌సభను రద్దు చేసి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు చట్ట సవరణలు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ రెండు అంశాలు తప్ప వేరే అంశాలు చర్చించబోతున్నట్లు స్పష్టమైంది. 

ఈ సమావేశాలలో చర్చించబోయే అజెండాను లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు బుధవారం రాత్రి బులెటిన్ ద్వారా విడుదల చేశాయి. పాత పార్లమెంట్ భవనంలోనే తొలిరోజున ఈ 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చిస్తారు. ఈ పాత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సమావేశం ఇదే. మర్నాడు అంటే సెప్టెంబర్ 19వ తేదీ నుంచి కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో సమావేశాలు మొదలవుతాయి. 

ఈ సమావేశాలలో కేంద్రం ప్రతిపాదిస్తున్న 5 బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. వాటిలో ఆగస్ట్ 3న రాజ్యసభ ఆమోదించిన ది అడ్వకేట్స్ సవరణ బిల్లు-2023, ది ప్రెస్‌ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బి-2023 ముందుగా లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. 

ఆగస్ట్ 10న రాజ్యసభలో ప్రవేశపెటిన ది చీఫ్ ఎలెక్షన్స్ ఆఫీసర్ అండ్ అదర్ కమీషనర్స్  అపాయింట్‌మెంట్స్, సర్వీస్, టర్మ్ బిల్లు, పోస్టాఫీసుల బిల్లు-2023, జూలై 7న లోక్‌సభ ఆమోదించిన ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు-2023లను ప్రవేశపెట్టనున్నామని సచివాలయాల బులెటిన్‌లో పేర్కొన్నాయి.  

మోడీ ప్రభుత్వం కీలకమైన బిల్లులను అజెండాలో చేర్చకుండానే హటాత్తుగా పార్లమెంటులో ప్రవేశపెట్టడం అలవాటే కనుక వివాదాస్పదమైన ఇండియా పేరు మార్పు, జమిలి ఎన్నికల బిల్లులను తప్పకుండా ఈ సమావేశాలలో ప్రవేశపెడతారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.