రాహుల్ గాంధీ ఓ అవుడేటెడ్ లీడర్: కల్వకుంట్ల కవిత

బుధవారం జగిత్యాల పట్టణంలో జరిగిన బిఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. దేశానికి సంబందించి ఏ అంశం, సమస్యపై అవగాహన, బాధ్యత లేదని ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని,  రాహుల్ గాంధీ ఎన్నడూ అప్‌డేట్ అవ్వని అవుడేటడ్ లీడర్ అని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ జాతీయస్థాయిలో ప్రధాని నరేంద్రమోడీ వేగాన్ని, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కేసీఆర్‌ వేగాన్ని అందుకోలేకపోతున్నారని, అందుకే కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోగా, బీజేపీ జాతీయస్థాయిలో బలపడిందని  కల్వకుంట్ల కవిత అన్నారు. 

ఈ నెల 16,17 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశాలకు వస్తున్న కాంగ్రెస్‌ నేతలను, రాహుల్ గాంధీని తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా?అంటూ సవాల్ చేశారు. ఇంతకీ ఆమె ఏమి అడిగారంటే, 

1. తెలంగాణలో ప్రకటిస్తున్న డిక్లరేషన్స్ అన్నిటినీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అమలుచేస్తున్నారా లేదా? 

2. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అమలుచేయగలరా?

3. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్‌ వైఖరి ఏమిటి? 

4. తెలంగాణలో దళితులకు మా ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చిన సంగతి మీకు తెలుసా, తెలియదా?తెలిసుంటే పోడు భూములు పట్టాలు ఇస్తామని ఎందుకు చెపుతున్నారు? 

5. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో దళితులకు మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు కల్పించారా లేదా? అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తన ప్రశ్నలకు కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశాలలో సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.