నన్ను అడ్డుకొన్న వాళ్ళందరి సంగతి చూస్తా: చీకోటి

కాసినో కింగ్, హవాలా కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ బీజేపీలో చేరేందుకు మంగళవారం ఉదయం భారీ ఊరేగింపుగా హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వెళ్తే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మొహం చాటేశారు. అది తీవ్రఅవమానంగా భావించిన చికోటి ఓ వీడియో విడుదల చేశారు.

తనను చూసి బీజేపీలో కొందరు భయపడుతున్నారని వారే తనను పార్టీలో చేరకుండా అడ్డుపడ్డారని అన్నారు. వారిలా తనకు వెన్నుపోటు పొడిచే అలవాటు లేదని తాను ఏమి చేసినా ధైర్యంగా బహిరంగంగానే చేస్తానన్నారు. మీ రాజకీయాలు మీరు చేయండి.. నా రాజకీయాలు నేను చేస్తానన్నారు.

త్వరలోనే తాను మరింత శక్తివంతంగా తిరిగివస్తానని అప్పుడు తనను అడ్డుకొన్నవారందరూ కన్నీళ్ళు పెట్టుకొని వలవల ఏడ్చేలా చేస్తానని హెచ్చరించారు. త్వరలోనే తానేమిటో అందరికీ చూపిస్తానని చికోటి ప్రవీణ్ కుమార్‌ హెచ్చరించారు. 

చికోటి ప్రవీణ్ కుమార్‌ చాలాకాలంగా హిందూ అజెండాతో పనిచేస్తున్నందున ఆయనను బీజేపీలో చేర్చుకోవాలని బండి సంజయ్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిన్నట్లు తెలుస్తోంది. కానీ చికోటి కాసినో, హవాలా వ్యవహారాల వలన పార్టీకి మచ్చ వస్తుందని, బిఆర్ఎస్‌ పార్టీ తమను వేలెత్తి చూపేందుకు అవకాశం ఇచ్చిన్నట్లవుతుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధిష్టానానికి నచ్చజెప్పిన్నట్లు తెలుస్తోంది.

చికోటి కారణంగా బండి సంజయ్, కిషన్‌రెడ్డి మద్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ బీజేపీ నేతలను బెదిరిస్తూ చికోటి ప్రవీణ్ కుమార్‌ విడుదల చేసిన తాజా వీడియో చూస్తే కిషన్ రెడ్డి నిర్ణయం సరైనదే అని అర్దమవుతుంది.

(ఈటీవీ సౌజన్యంతో)