మహారాష్ట్రలో కేసీఆర్‌ మరో బహిరంగ సభ.. త్వరలో

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తానని చెప్పినప్పటికీ జాతీయస్థాయిలో ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. కానీ మహారాష్ట్రలో మాత్రం బిఆర్ఎస్‌ పార్టీని విస్తరించి బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. 

ఇప్పటికే కేసీఆర్‌ నాందేడ్, కాందార్-లోహ, ఔరంగాబాద్, సాంగ్లీలో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటివారంలో గానీ కేసీఆర్‌ సోలాపూర్‌లో మరో భారీ సభ నిర్వహించబోతున్నారు. బిఆర్ఎస్‌ నేతలు సోలాపూర్‌లో పర్యటించి బాలకోట్, ఈద్గా మైదానాలను పరిశీలించారు. వాటిలో ఒకటి ఖరారు చేయనున్నారు.

మహారాష్ట్ర ఇన్‌చార్జిగా వంశీధర్‌ను, కిసాన్ సమితి ఇన్‌చార్జిగా మాణిక్ కదమ్‌ తదితరులు ఈ సభకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కనీసం లక్షమందిని జనసమీకరణ చేయాలని వారికి లక్ష్యంగా నిర్దేశించిన్నట్లు తెలుస్తోంది.               

మహారాష్ట్రలో 48 లోక్‌సభ సీట్లు, 288 శాసనసభ సీట్లు ఉన్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బీజేపీ రెండు కూటములకు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే మెజార్టీ రాకపోవచ్చని, అప్పుడు తెలంగాణ, మహారాష్ట్రలో కలిపి కనీసం బిఆర్ఎస్‌ పార్టీ 30 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగితే జాతీయరాజకీయాలలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్‌ భావిస్తున్నట్లున్నారు.