నేడు బీజేపీలో చేరనున్న చికోటి ప్రవీణ్

‘క్యాసినో కింగ్’గా ప్రసిద్ది చెందిన హైదరాబాద్‌కు చెందిన చికోటి ప్రవీణ్ కుమార్‌ నేడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరడమే కాదు... ఎల్బీనగర్ లేదా జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఎన్నికలలో పోటీ కూడా చేయాలనుకొంటున్నారు. ఎల్బీనగర్ నుంచి అవకాశం కల్పిస్తే శాసనసభకు, జహీరాబాద్ నుంచయితే లోక్‌సభకు పోటీ చేయాలనుకొంటున్నారు.

చికోటి ప్రవీణ్ కుమార్‌ క్యాసినో వ్యవహారాలు మొదలుపెట్టడానికి ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాడు. చికోటి ప్రవీణ్ కుమార్‌ చాలా కాలంగా హిందుత్వ అజెండాతో పనిచేస్తున్నాడు. హిందూ ధర్మరక్షణ కొరకు ‘ధర్మ రక్ష’ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. కనుక ఆర్‌ఎస్ఎస్, బీజేపీ తదితర హిందూ అజెండాతో పనిచేసే సంస్థలు, పార్టీలతో చాలాకాలం నుంచి చికోటి ప్రవీణ్ కుమార్‌కు మంచి పరిచయాలున్నాయి. ఇప్పుడు బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి కూడా రావాలనుకొంటున్నాడు. 

అతనిని బీజేపీలో చేర్చుకొంటే ఆ పార్టీకి చాలా ఉపయోగపడవచ్చు కానీ క్యాసినోలు, ప్రైవేట్ జూ నిర్వహించే అటువంటి వ్యక్తి వలన బీజేపీకే చెడ్డపేరు వస్తుంది. ముఖ్యంగా బీజేపీని విమర్శించేందుకు కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ పార్టీలకు అవకాశం కల్పించిన్నట్లవుతుంది.