తెలంగాణ హైకోర్టు వరుసపెట్టి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేస్తుంటే, సుప్రీంకోర్టు వాటిపై స్టే విధిస్తుండటం విశేషం. నిజానికి సుప్రీంకోర్టు ఆదేశం మేరకే తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను విచారణ చేసి అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై అనర్హత వేటు వేస్తోంది.
మొదట కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసి ఆయన చేతిలో ఓడిపోయిన జలగం వెంకట్ రావును ఎమ్మెల్యేగా ప్రకటించగా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొన్నారు. తాజాగా గద్వాల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసి ఆయన చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్ధి డికె అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించగా, ఇప్పుడు ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే సంపాదించుకొన్నారు.
బండ్ల ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ ఈ కేసును రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ రెండు కేసుల తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ టాంపరింగ్ కేసుపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఒకవేళ దానిలో ఆయన దోషిగా తేలితే హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేయడం, అప్పుడు ఆయన కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం తధ్యమే అని భావించవచ్చు. అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణలు, తీర్పులతో చివరికి ఏమి సాధించినట్లో తెలీని పరిస్థితి కనిపిస్తోంది.