తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభకు అనుమతి నిరాకరణ

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌ నగర శివారులో తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు అనుమతి నిరాకరించింది. కాంగ్రెస్‌ సభ నిర్వహించాలనుకొంటున్న ఆ స్థలం దేవాదాయశాఖ అధీనంలో ఉంది కనుక అనుమతి కోరుతూ దేవాదాయశాఖకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహా రెడ్డి లేఖ వ్రాశారు.

దానిపై దేవాదాయ శాఖ కమీషనర్ స్పందిస్తూ, అక్కడ ఎటువంటి రాజకీయ కార్యక్రమాలను అనుమతించలేమని తెలియజేస్తూ లేఖ ద్వారా బదులిచ్చారు. మొదట సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలనుకొంది. కానీ ఆదేరోజున అక్కడ బిజెపి కూడా తెలంగాణ విమోచన దినోత్సవ సభ నిర్వహించబోతుండటంతో, కాంగ్రెస్‌ నాయకులు తుక్కుగూడలో స్థలాన్ని ఎంపిక చేసుకొంటే దానికి అనుమతి లభించలేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ వెతుకులాట తప్పడం లేదు. 

ఈ బహిరంగసభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియంకా గాంధీలతో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. కనుక తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. దీని కోసం కమిటీలు వేసుకొని భారీ ఏర్పాట్లు కూడా చేసుకొంటోంది. కానీ సభ నిర్వహించుకొనేందుకు వేదిక లభించడం లేదు. మరిప్పుడు ఎక్కడ సభ నిర్వహిస్తుందో?