ముషీరాబాద్ నుంచి నేనే పోటీ చేస్తా: అంజన్ యాదవ్‌

కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ సుమారు 75 మంది అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదానికి పంపిందని వార్తలు వస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకుడు అంజన్ కుమార్‌ యాదవ్‌ ఈరోజు ముషీరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచి తానే కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ నుంచి దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇంకా అనేకమంది నాయకులు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిపోయినా నేను, నా అనుచరులే బలంగా నిలబడి కాంగ్రెస్‌ను కాపాడుకొన్నాము. కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు మేమే పార్టీ కోసం బలంగా నిలబడ్డాము. కనుకనే నేడు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనగలుగుతోంది. 

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో కూడా మేమే ముషీరాబాద్‌లో ప్రజలకు అండగా నిలబడి అన్ని విధాలాసాయపడ్డాము. మాకు ఈ నియోజకవర్గంలోని ప్రజలతో బలమైన అనుబంధం ఉంది కనుక ఇక్కడి నుంచి నేను కాకుండా మరెవరు పోటీ చేస్తారు?

ఈసారి బిఆర్ఎస్ పార్టీ బలమైన అభ్యర్ధి (ముఠా గోపాల్‌)ని మళ్ళీ బరిలో దింపింది. ఆయనను గెలిపించుకొనేందుకు కేసీఆర్‌ పెద్దపెద్ద లీడర్లను ఇక్కడ దించబోతున్నారు. కనుక వారందరినీ ఢీకొని ఓడించాలంటే ముషీరాబాద్‌ నుంచి నేనే పోటీ చేయాలి. మా అధిష్టానం కూడా ఇదే చెపుతోంది. కనుక ఈసారి నేనే ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసి గెలువబోతున్నాను. 

ఈ టికెట్‌కి మా అబ్బాయి (అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కుమార్‌ యాదవ్‌) యువజన కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ముడి పెట్టడం సరికాదు. అతను రెండుసార్లు ఆ పదవికి ఎన్నికవడం మామూలు విషయం కాదు. అతనికీ కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తుంది నాకూ ఇస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.