కేసీఆర్‌కు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వార్నింగ్?

జనగామ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ముఖ్య అనుచరులు శుక్రవారం ఉదయం పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించి కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచన మేరకే వారు కేసీఆర్‌ను హెచ్చరించారు కనుక ఆయనే వారిద్వారా కేసీఆర్‌ను హెచ్చరించిన్నట్లే భావించవచ్చు.

చేర్యాల, మద్దూరు మండలాలకు చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించి, “నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు రేయింబవళ్ళు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కష్టపడ్డారు. తెలంగాణ ఉద్యమాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. జనగామలో బిఆర్ఎస్ జెండా రెపరెపలాడుతోందంటే దానికి ఆయనే కారణం. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిత్యం ప్రజల మద్యనే ఉంటారు కనుకనే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

ఆయనను కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్‌ ఇస్తే ఈసారి జనగామలో బిఆర్ఎస్‌కు ఓటమి తప్పదు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికే మళ్ళీ టికెట్‌ ఇవ్వాలని, అభ్యర్ధిగా ప్రకటించి కార్యకర్తలలో నెలకొన్న అయోమయాన్ని తొలగించాలని సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాము. మేమందరం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వెంటే ఉన్నాము. ఉంటాము కూడా. కనుక నియోజకవర్గం గురించి ఏమీ తెలియని పల్లాను తెచ్చి మా నెత్తిన రుద్దవద్దని సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు. 

కేసీఆర్‌ ప్రకటించిన 115 మంది బిఆర్ఎస్ అభ్యర్ధుల తొలిజాబితాలో 4 నియోజకవర్గాలలో అభ్యర్ధులను ఖరారు చేయకుండా పెండింగులో పెట్టారు. వాటిలో జనగామ కూడా ఒకటి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఈసారి జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలో దింపాలని భావిస్తున్నారు. అందుకే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన అనుచరుల ద్వారా కేసీఆర్‌కు ఈ హెచ్చరిక చేయించారు. మరి కేసీఆర్‌ ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.