నేడు భారత్‌కు రానున్న అగ్రదేశాధినేతలు

ఈ నెల 9,10 తేదీలలో న్యూఢిల్లీలో జరుగబోతున్న జి-20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రుషి శునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ అల్బనీస్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, జపాన్ ప్రధాని పుమియో కిషిదా, చైనా ప్రధాని లీకియాంగ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇంకా మిగిలిన దేశాధినేతలు నేడు ఢిల్లీకి రానున్నారు. 

ఇంతమంది ప్రముఖులు ఒకేసారి దేశరాజధాని ఢిల్లీకి వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి జీ-20 సదస్సు ముగిసేవరకు ఢిల్లీలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. గగనతలంలో వాయుసేన హెలికాఫ్టర్లలో పహారా కాస్తుంది. జీ-20 సదస్సు జరుగబోయే భారత్‌ మండపంపై ఒకవేళ డ్రోన్ దాడులు జరిగితే వాటిని గాలిలోనే పేల్చివేసేందుకు యాంటీ-డ్రోన్ పరికరాలను అమర్చారు. ఢిల్లీ అంతటా భారీగా భద్రతాదళాలను మోహరించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్‌ మండపానికి కిలోమీటరు పరిధిలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు సిసి కెమెరాలను అమర్చి నిఘా పెట్టారు. జోబైడెన్, రుషి శునాక్ తదితర ప్రముఖుల కోసం ఢిల్లీలో వివిద స్టార్ హోటల్స్ లో బస ఏర్పాటు చేసినందున ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా భద్రతాదళాలు తమ అధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  

ఈసారి భారత్‌ జీ20 సదస్సుకి భారత్‌ తరపున ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత వహించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వద్ద గల ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటరులో జరుగబోతున్న ఈ సదస్సుకి నినాదం ‘వసుదైక కుటుంబం’ (వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్) అని నిర్ణయించారు.