ఏడుపాయల ఆలయంలో బిఆర్ఎస్‌ నేతలు పోటాపోటీ ప్రమాణాలు!

మెదక్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డికి  మళ్ళీ టికెట్‌ కేటాయించడంతో నియోజకవర్గంలో టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు భగ్గుమంటున్నారు. పద్మ, ఆమె భర్త దేవందర్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని అసమ్మతి నేతలు ఆరోపించారు. దేవేందర్ రెడ్డి పదేళ్లుగా ఏడుపాయల దుర్గమ్మ తల్లి సొమ్మును పందికొక్కులా బొక్కేస్తున్నారని ఆరోపించారు.

ఇఫ్కో డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్న ఆయన భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో ఆయన కోనాపూర్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడూ రెండు కోట్లు అవినీతికి పాల్పడ్డారని, అందుకు జిల్లా కలెక్టర్‌ ఆయనను సస్పెండ్ కూడా చేశారని ఆరోపించారు. దానిపై కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొన్నారు కానీ ఆ రెండు కోట్లు ఎవరి జేబులోకి వెళ్లిపోయాయో తేల్చనేలేదని ఆరోపించారు.

భర్త అవినీతి, అక్రమాలను అడ్డుకోకపోగా ఎమ్మెల్యే పద్మ కూడా అవినీతిలో భాగస్వామిగా మారిపోయి అయిన కాడికి నియోజకవర్గాన్ని దోచుకుతింటున్నారని మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ గంగా నరేందర్ ఆయన అనుచరులు జీవన్ రావు, సర్పంచ్‌ రాజిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు ఆరోపించారు. 

తమపై ఆరోపణలు చేస్తున్న అసమ్మతి నేతలకు జవాబుగా దేవేందర్ రెడ్డి ఈరోజు ఉదయం ఏడుపాయల చెరువులో స్నానం చేసి తడిబట్టలతో దుర్గమ్మ మీద ప్రమాణం చేసి తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, తామిద్దరం నియోజకవర్గంలో సొంత డబ్బుతో అనేక సమాజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని, దుర్గమ్మ సొమ్ము తినేంత నీచానికి దిగజారిపోలేదని అన్నారు. తమపై ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నవారికి ప్రజలే తగిన విదంగా బుద్ధి చెపుతారని అన్నారు. 

దేవేందర్ రెడ్డి తడిబట్టలతో ప్రమాణం చేసిన్నట్లు తెలియడంతో గంగా నరేందర్ కూడా తన అనుచరులతో కలిసి స్నానం చేసి దుర్గమ్మ సాక్షిగా దేవేందర్ రెడ్డి అమ్మవారి సొమ్ము బొక్కేసారని, అయినా అమ్మవారిపై ప్రమాణం చేసి తన పతనాన్ని తానే కొనితెచ్చుకొన్నారని ఆరోపించారు. పద్మా దేవేందర్ రెడ్డి టికెట్‌ విషయంలో కేసీఆర్‌ పునరాలోచించి కొత్త అభ్యర్ధిని ప్రకటించాలని లేకుంటే తమలో ఒకరు తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేసి పద్మా దేవేందర్ రెడ్డిని ఓడించడం ఖాయమని హెచ్చరించారు.