తెలంగాణలో మరో కొత్త పార్టీ!

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకుల కప్పగంతులు మళ్ళీ మొదలయ్యాయి. అలాగే నాలుగు చినుకులు పడగానే పచ్చగడ్డి మళ్ళీ చిగురించిన్నట్లు, ఎన్నికల ముంగిట కొత్తపార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి.   

తెలంగాణ ప్రజలకు తీన్‌మార్‌  మల్లన్నగా చిరపరిచితుడైన చింతపండు నవీన్ కుమార్‌ కూడా కొత్తగా ఓ రాజకీయపార్టీని స్థాపించబోతున్నారు. ఆ పార్టీ పేరు ‘తెలంగాణ నిర్మాణ సమితి.’ దీని కోసం కేంద్ర ఎన్నికల కమీషన్‌ వద్ద దరఖాస్తు చేసుకోగా, దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 30వ తేదీలోగా తెలియజేయవలసిందిగా ఈసీ కోరుతూ వెబ్‌సైట్‌లో ఓ నోటీస్ పెట్టింది. ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా వరంగల్‌ జిల్లా ధర్మాసాగర్‌కు చెందిన మాదం రజినీ కుమార్‌, కోశాధికారిగా హైదరాబాద్‌, సరూర్ నగర్‌కు చెందిన ఆర్‌.భావన ఉంటారని తీన్‌మార్‌  మల్లన్న ఏసీకి సమర్పించిన దరఖాస్తులో పేర్కొన్నారు. 

సిఎం కేసీఆర్‌ను, బిఆర్ఎస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో తీన్‌మార్‌  మల్లన్న కూడా ఒకరు. జర్నలిస్టుగా ఉన్న తీన్‌మార్‌  మల్లన్న ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టి 2015లో శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, ఆ తర్వాత మళ్ళీ 2019 ఉపఎన్నికలలో హుజూర్ నగర్‌ నుంచి శాసనసభకు, 2021లో శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 

ఈసారి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఎట్టి పరిస్థితులలో గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని తీన్‌మార్‌  మల్లన్న చాలా పట్టుదలగా ఉన్నారు. ఆయన 2021, నవంబర్‌ 7వ తేదీన బిజెపిలో చేరారు కానీ దానిలో ఇమడలేక బయటకు వచ్చేసి ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకోబోతున్నారు.