
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈనెల 16న సిఎం కేసీఆర్ మోటార్ ఆన్ చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇటీవలే డ్రైరన్ విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కనుక 16న నార్లాపూర్ పంప్ హౌసులోని మోటర్లు ఆన్ చేసి రెండు కిమీ దూరంలో నిర్మించిన నార్లాపూర్ జలాశయంలోకి నీళ్ళు పంపింగ్ చేసి నింపుతారు. ఆ తర్వాత కేసీఆర్ కృష్ణానది జలాలకు పూజలు చేసి బహిరంగసభలో ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ సచివాలయంలో సంబందిత శాఖల అధికారులతో మాట్లాడుతూ, “అనేక అవరోధాలు అధిగమించి ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుని కూడా సిద్దం చేసుకొన్నాము. దైవకృప, ఇంజనీర్ల కృషి వలన ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు కోసం రేయింబవళ్లు కష్టపడిన ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మన సంకల్పానికి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా లభించినందునే ఈ ప్రాజెక్టు ఇంత వేగంగా నిర్మించుకోగలిగాము. కనుక ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలలో ప్రతీ గ్రామంలోని ఆలయాలలో దేవీదేవతల పాదాలను ఈ పవిత్ర కృష్ణమ్మ జాలలతో అభిషేకాలు చేసుకొందాము. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణ జిల్లాలకు సాగునీరు, త్రాగునీటి కష్టాలు తీరిపోతాయి,” అని అన్నారు.