తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఈసారి హైదరాబాద్‌లో ఈ నెల 16,17 తేదీలలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్వర్యంలో జరుగబోయే ఈ కమిటీ సమావేశాలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంకా కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ పాల్గొంటారు.
ఈ సమావేశాల ముగింపు సందర్భంగా 17వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఓ భారీ బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దానిలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. కనుక ఈ సభ కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ బోర్డుకు దరఖాస్తు చేసుకొంది. సభ నిర్వహణ కోసం నిన్న కాంగ్రెస్ నేతలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కి వెళ్ళి పరిశీలించారు కూడా.
అయితే ఏటా సెప్టెంబర్ 17వ తేదీన బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోనే నిర్వహిస్తుంటుంది. కనుక ఈసారి కూడా అక్కడే నిర్వహించేందుకు అది కూడా దరఖాస్తు చేసుకొంది. దీంతో మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కోసం రెండు జాతీయ పార్టీల మద్య పోటీ ఏర్పడింది. అయితే కంటోన్మెంట్ బోర్డుని నియంత్రించే రక్షణశాఖ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది కనుక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బిజెపి సభకే కేటాయించవచ్చు.