మంత్రి గంగులకు ఈడీ నోటీస్ జారీ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ఈడీ నోటీసులు పంపించిన్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన శ్వేతా గ్రానైట్స్ కంపెనీ విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తుంటుంది. ఆ క్రమంలో రూ.4.8 కోట్ల మేర ఉల్లంఘనలు జరిగాయని, శ్వేతా గ్రానైట్స్ కంపెనీ సుమారు రూ.50 కోట్లు కేంద్రానికి పన్ను చెల్లించవలసి ఉండగా కేవలం రూ.3 కోట్లు మాత్రమే చెల్లించిందని, కనుక తక్షణం ఆ బకాయిలు చెల్లించాలని ఆ నోటీస్ సారాంశం. ఇదేగాక శ్వేతా గ్రానైట్స్ కంపెనీ హవాలా మార్గంలో విదేశాలకు నిధులు బదిలీ చేసిన్నట్లు ఈడీ గుర్తించింది. దానిపై కూడా వివరణ కోరిన్నట్లు తెలుస్తోంది. 

గత ఏడాది నవంబర్‌లో ఈడీ అధికారులు హైదరాబాద్‌, కరీంనగర్‌లోని శ్వేతా గ్రానైట్స్ కార్యాలయాలలో సోదాలు నిర్వహించినప్పుడు, సుమారు 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను అక్రమంగా తరలించిన్నట్లు గుర్తించారు. అయితే తమ కంపెనీ ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని, బిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నందునే ఈడీ, సీబీఐలను తమపైకి ఉసిగొల్పి, ఇటువంటి తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయించి వేధిస్తున్నారని గంగుల ఆరోపించారు. 

గ్రానైట్ ఎగుమతులు, వాటికి సంబందించిన ఆర్ధికలావాదేవీలను రహస్యంగా దాచిపుచ్చడం అసంభవం. అందునా ఈడీ దృష్టి నుంచి తప్పించుకోవడం ఇంకా కష్టం. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు బాగున్నంత వరకు ఇటువంటి అక్రమాలు, ఆర్ధిక అవకతవకలు ఎన్ని జరుగుతున్నా ఈడీ, ఐ‌టి అధికారులు చేతులు ముడుచుకొని చూస్తుండిపోవలసి వస్తుందని అందరికీ తెలిసిందే.

ఆ సంబంధాలు చెడినప్పుడు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్‌ రాగానే ఈడీ అధికారులు ఇలా హడావుడి చేస్తుంటారు. మళ్ళీ అధికార పార్టీల మద్య అవగాహన ఏర్పడగానే సైలంట్ అయిపోతుంటారు. అందుకే ఐ‌టి, ఈడీ, సీబీఐ వంటి సంస్థల విశ్వసనీయత ఎప్పుడూ ప్రశ్నార్ధకంగానే ఉంటుంది. అందుకే నోటీసులు అందుకొన్నవారు సైతం వాటినే వేలెత్తి చూపగలుగుతున్నారని భావించవచ్చు.