
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు సరిగ్గా ఎన్నికలకు ముందు వరుసపెట్టి షాక్ ఇస్తోంది. ఇప్పటికే వనమా వెంకటేశ్వరరావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను అనర్హులుగా ప్రకటించిన హైకోర్టు, మంత్రి శ్రీనివాస్ గౌడ్కి కూడా షాక్ ఇస్తోంది.
ఆయన 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ని రిటర్నింగ్ అధికారి సాయంతో ఎన్నికల సంఘం పోర్టల్లో మార్చారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, దానిపై అడ్వకేట్ కమీషన్ను నియమించింది.
ఈనెల 8న మెదక్ ఆర్డీవో, 11న నల్గొండ అడిషనల్ కలెక్టర్ వాంగ్మూలాలను కమీషన్ రికార్డ్ చేయనుంది. ఈ కేసుకు సంబంధించి ఇతర సాక్షులు ఎవరైనా ఉంటే వారు కూడా కమీషన్ ఎదుట హాజరయ్యి వాగ్మూలం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అడ్వకేట్ కమీషన్ ఈ నెల 11లోగా విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 12కి వాయిదా వేసింది.
ఈ కేసు విచారణ నిలిపివేయాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ వేయగా దానిని తిరస్కరించడమే కాకుండా విచారణను ఇంకా వేగవంతం చేసింది. ఒకవేళ శ్రీనివాస్ గౌడ్ కూడా ఎన్నికల సంఘం వెబ్సైట్ను ట్యాంపరింగ్ చేసిన్నట్లు రుజువైతే, ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా వీలులేకుండా హైకోర్టు తీర్పు చెప్పవచ్చు.
హైకోర్టులో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు విచారణలో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు హైకోర్టు వాటి విచారణను వేగవంతం చేసింది. కనుక ఎన్నికల గంట మ్రోగేలోగా మరింతమందిపై అనర్హత వేటు పడినా పడవచ్చు. బిఆర్ఎస్ అభ్యర్ధులుగా మళ్ళీ వారినే ప్రకటించిన తర్వాత ఈవిదంగా జరుగుతుండటం చాలా ఇబ్బందికరమే.