
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో నార్లాపూర్ గ్రామంలో పంప్ హౌస్ నిర్మించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సోమవారం ఉదయం దానిలోని మొదటి మోటారును స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
ప్రపంచంలోకే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కాగా దాని కంటే ఈ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పెద్దదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మోటర్ల కంటే చాలా ఎక్కువ సామర్ధ్యం కలిగిన 145 మెగావాట్ల భారీ మోటర్లను ఈ ప్రాజెక్టులో ఏర్పాటు చేశామని చెప్పారు.
డ్రైరన్ విజయవంతం అయ్యిందని, ఈ నెల 15 నుంచి నీటిని పంపింగ్ చేసి, ఏదుల, వట్టెం, కరివేన జలాశయాలలో నింపుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు త్రాగు,సాగు నీరు అందుతుందని రజత్ కుమార్ తెలిపారు.
ఈ రోజు జరిగిన పూజ, అనంతరం డ్రైరన్ కార్యక్రమాలలో ప్రాజెక్టు ఈఎన్‌సీ మురళీధర్ రావు, ఎత్తిపోతల పధకాల సలహాదారు పెంటారెడ్డి, సీఈలు రమణారెడ్డి, హమీద్ ఖాన్, ఎస్ఈలు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, ఈఈలు మురళి, శ్రీనివాసరెడ్డి, రవీందర్, దిగువ స్థాయి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. డ్రైరన్ విజయవంతం అవడంతో అందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొంటూ పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ స్వీట్స్ పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, “ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం! సగర్వంగా ఎగురుతున్నది తెలంగాణ జలవిజయ పతాకం! నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం. ఇది తెలంగాణ సాగునీటిరంగంలో మరో కాళేశ్వరం. అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ... కుట్రలను, కేసులను గెలుస్తూ.. జలసంకల్పంతో అనుమతులు సాధించి దశాబ్దాల కలను సాకారం చేస్తూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవుతున్నది... బిరబిరా కృష్ణమ్మ బీళ్లకు నీళ్ళందించనున్నది ఇది తెలంగాణ జలశక్తి. ఇది కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధి,” అంటూ ట్వీట్ చేస్తూ ఈ ప్రాజెక్టు ఫోటోలను ప్రజలతో పంచుకొన్నారు.