అప్పుడు గెలిపించిన సీపీఐయే ఇప్పుడు...

మునుగోడు ఉపఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు సీపీఐ, సీపీఎం పార్టీలు బిఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ఇచ్చి కేసీఆర్‌తో కలిసి బహిరంగసభలో, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. 

ఉపఎన్నికల తర్వాత శాసనసభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని వామపక్షాలు ఆశించగా, సిఎం కేసీఆర్‌ వామపక్షాలను సంప్రదించకుండానే 115 మంది బిఆర్ఎస్‌ అభ్యర్ధుల జాబితాను ప్రకటించడంతో అవి భగ్గుమన్నాయి. ఉపఎన్నికలో బిఆర్ఎస్‌కి మద్దతు ఇచ్చి గెలిపించి పొరపాటు చేశామని, శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి బిఆర్ఎస్‌ని ఓడించి, కేసీఆర్‌ని గద్దె దించుతామని వామపక్షాలు శపధం చేస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలో అభివృద్ధిపనులకు శిలాఫలకం వేసేందుకు రాగా, ఆయనను కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నేతలు అడ్డుకొన్నారు.

ఉపఎన్నికలకు ముందు శిలాఫలకాలు వేసిన పనులే ఇంతవరకు మొదలుపెట్టకుండా మళ్ళీ కొత్తగా శిలాఫలకాలు వేసి ఎవరిని మభ్యపెట్టాలనుకొంటున్నారని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో కూసుకుంట్లను తప్పకుండా ఓడగొడతామని మొహం మీదనే చెప్పి వెనక్కు తిప్పి పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట వచ్చిన బిఆర్ఎస్‌ కార్యకర్తలకు, కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తలకు మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడగా పోలీసులు కలుగజేసుకొని శాంతింపజేశారు.