బిజెపికి ఓటమి భయం అందుకే జమిలి ఎన్నికలు

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేయడం, ఈ నెల 18-22 వరకు 5 రోజులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతుండటంపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బిజెపికి ఓటమి భయం పట్టుకొంది. దాని నుంచి తప్పించుకొనేందుకే జమిలి ఎన్నికల ప్రతిపాదన చేస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు దాని కోసమే అని భావిస్తున్నాను. ఒకవేళ కేంద్రానికి నిజంగా జమిలి ఎన్నికలు నిర్వహించే దమ్ముంటే, లోక్‌సభతో పాటు దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉంది. శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్‌, బిజెపిలకంటే ముందుగా ఒకేసారి 115 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగు ఉండదు. మళ్ళీ మరోసారి బిఆర్ఎస్ పార్టీయే గెలిచి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారు. ఇది ఖాయం,” అని అన్నారు.