
సిఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది బిఆర్ఎస్ అభ్యర్ధుల తొలిజాబితాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగానైనా ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి బరిలో దిగాలని నిశ్చయించుకొన్నారు. అయితే నిన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన నివాసానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. తుమ్మల కూడా ఆ ఆలోచనతోనే ఉన్నారు కనుక సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది.
అయితే ఖమ్మం జిల్లాకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు. కనుక ముందుగా ఆయనను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఒప్పించవలసి ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం, కొత్తగూడెం రెండు జిల్లాలపై మంచి పట్టు ఉంది. కనుక ఆయన వేరే చోటి నుంచి పోటీ చేసేందుకు ఒప్పించి ఉండవచ్చు.
నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వైఎస్ షర్మిల కూడా పాలేరు నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు. కానీ ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం నచ్చజెప్పి ఉండవచ్చు.
పొంగులేటి, వైఎస్ షర్మిల ఇద్దరి గురించి తెలిసిన తర్వాతే రేవంత్ రెడ్డి తుమ్మలని కలిసారు. అంటే వారిని వేరే చోట నుంచి పోటీ చేసేందుకు ఒప్పించిన్నట్లే భావించవచ్చు. కనుక తుమ్మల కాంగ్రెస్లో చేరడం, పాలేరు నుంచే శాసనసభకు పోటీ చేయడం రెండూ ఖాయంగానే కనిపిస్తున్నాయి. అయితే ముహూర్తం ఎప్పుడో తెలియాల్సి ఉంది.
తాజా సమాచారం: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.