తెలంగాణలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీఓఏ)కు తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగ రోజున జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వారికి ప్రభుత్వం నెలకు రూ.3,900 గౌరవవేతనం చెల్లిస్తుండగా ఈ నెల నుంచి దానికి రూ.5,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. అదనపు సాయం రూ.3,000తో కలిపి నెలకు మొత్తం రూ.8,000 జీతం అందుకోబోతున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 17,608 మంది వీఓఏలకు లబ్ధి కలుగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలు తదితరులకు ఇస్తున్న ఆసరా పించనే రూ.2,016 ఉంది. కానీ గ్రామాలలో జరిగే ప్రతీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించే వీఓఏలకు ఇంతకాలం కేవలం రూ.3,9000 మాత్రమే వేతనం ఇస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ.10,000 జీతం ఇస్తామని కేసీఆర్ గత ఎన్నికలలో హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని వారు చాలాసార్లు ధర్నాలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఇన్నేళ్ళ తర్వాత వారి పోరాటాలు ఫలించి కొద్దిగా జీతాలు పెరిగాయి. కానీ నేటికీ అన్నీ కలిపినా నెలకు రూ.10,000 కాలేదు.
గ్యాస్, విద్యుత్, నిత్యావసర సరుకుల ధరలు నానాటికీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో నెలకు రూ.8,000తో ఓ కుటుంబం జీవనం సాగించడం చాలా కష్టమే. కనుక రాష్ట్ర ప్రభుత్వం వీఓఏల జీతాలు మరికొంత పెంచి కనీసం నెలకు రూ.15,000 అందించి ఉంటే వారూ చాలా సంతోషించి ఉండేవారు.